హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు, వాటి ఆర్థిక స్వేచ్ఛను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో పంచాయతీల సొంత నిధుల వాడకంపై విధించిన ఆంక్షలను ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేసింది. పల్లెల్లో వసూలయ్యే పన్నులు, ఫీజులను ప్రభుత్వ ట్రెజరీలో కాకుండా, నేరుగా పంచాయతీ బ్యాంక్ అకౌంట్లలోనే జమ చేసుకుని ఖర్చు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం ‘తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018’ లోని సెక్షన్ 70(3)కి సవరణ చేసేందుకు రెడీ అయ్యింది.
ఇందుకు సంబంధించిన ఫైల్ కు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలుపగా.. సవరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే చాన్స్ఉన్నట్లు తెలిసింది. కాగా, 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 70(3) గ్రామ పంచాయతీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసింది. ఈ సెక్షన్ ప్రకారం.. గ్రామాల్లో ప్రజల నుంచి వసూలు చేసే ఇంటి పన్నులు, నల్లా పన్నులు, లేఅవుట్ ఫీజులు, సంతల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ ట్రెజరీ (ఎస్టీఓ)లోనే డిపాజిట్ చేయాలనే నిబంధన పెట్టారు.
దీంతో గ్రామంలో ఏదైనా అత్యవసర సమస్య వస్తే చేతిలో సొంత పైసలున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడింది. తాగునీటి పైపులైన్ పగిలిన, మోటారు కాలిపోయిన, మురుగు కాల్వలు తీయాలన్నా, వీధి దీపాలు పాడైనా వెంటనే రిపేరు చేయించలేని పరిస్థితి ఏర్పడింది. చిన్న పనికి కూడా ట్రెజరీలో బిల్లులు పెట్టి, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగి టోకెన్లు పాస్ చేయించుకోవాల్సి వచ్చేది. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం తాజాగా చేయనున్న చట్ట సవరణతో పంచాయతీలకు పూర్తి ఆర్థిక స్వేచ్ఛ లభించనుంది.
